: 'బిగ్ బాస్ -7'పై కలర్స్ చానల్ కు షోకాజ్ నోటీసులు
ఎంటర్ టైన్మెంట్ చానల్ కలర్స్ కు కేంద్ర సమాచార, ప్రసార శాఖ షోకాజ్ నోటీసులు పంపింది. నెలరోజుల నుంచి చానల్ లో ప్రసారమవుతున్న పాప్యులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్-7' సీజన్ కు సంబంధించి ప్రసారం చేసిన రెండు ఎపిసోడ్ లు అభ్యంతరకరంగా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొంది. అలాంటి వాటిని ప్రసారం చేయడంలో నియంత్రణ పాటించాలని తీవ్రంగా ఆక్షేపించింది. మరోవైపు కోర్టు కూడా దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించడంతో సదరు మంత్రిత్వ శాఖ కలర్స్ చానల్ కు నోటీసులు జారీ చేసింది. మరింత వివరాల్లోకి వెళితే...కొన్నిరోజుల కిందట ప్రసారం చేసిన రెండు ఎపిసోడ్ లలో అభ్యర్ధులు మాట్లాడుకునే సమయంలో ఉపయోగించిన మాటలు వినడానికి అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు తెలిపారు. అలాంటివాటిని చూపించకుండా ఉండాల్సిందని చెప్పిన పలువురు వీక్షకులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించడంతో వివరణ ఇవ్వాలని సమాచార, ప్రసార శాఖ సదరు చానల్ కు తెలిపింది.