: బాలికను బలవంతంగా పెళ్లాడిన సుడాన్ దేశస్థుడు అరెస్ట్


డబ్బులు ఎరగా చూపి కూతురు వయసున్న పేద ముస్లిం బాలికను బలవంతంగా పెళ్లాడిన సుడాన్ దేశస్థుడిని హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విదేశీయుడికి సహకరించిన స్థానికులు ముగ్గురు కూడా పోలీసులకు దొరికిపోయారు. 

సుడాన్ దేశంలోని ఒక ఆయిల్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేసే ఒసామా ఇబ్రహీం వివాహం కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ కు విచ్చేశాడు. ఇక్కడ పేద ముస్లిం యువతులను వివాహమాడడం చాలా తేలికని స్నేహితులు చెప్పడంతో అతడు హైదరాబాద్ కు ఫిబ్రవరి 19న వచ్చాడు. స్థానికంగా ముంతాజ్ బేగం అనే మహిళ నలుగురు యువతులను ఒసామాకు చూపించింది. అందులో మొఘల్ పుర ప్రాంతానికి చెందిన 17ఏళ్ల బాలిక నచ్చడంతో రెండు లక్షల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ముంతాజ్ ఆ బాలిక తల్లిదండ్రులను ఇందుకు ఒప్పించింది. అయితే, తనకు ఒసామాను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని ఆ బాలిక నిరాకరించింది. తన తండ్రి వయస్సు అతనికి ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా వినకుండా ఫిబ్రవరి 21న ఆ బాలికకు, ఒసామాకు వివాహం జరిపించారు. దీంతో శుక్రవారం రాత్రి ఆ బాలిక తప్పించుకుని వచ్చి మొఘల్ పుర పోలీసులను ఆశ్రయించింది.
 
పోలీసులు ఒసామాను, అతడి వద్ద నుంచి లక్ష రూపాయలు కమీషన్ తీసుకుని సహకరించిన మొహమ్మద్ హస్సాన్, క్వాజీ నసీరుద్దీన్, ముంతాజ్ బేగంను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. బాలిక తల్లిదండ్రుల కోసం గాలింపు మొదలు పెట్టారు. 

  • Loading...

More Telugu News