: ఏజ్ తగ్గించుకోండి ఇలా
పరుగులెడుతున్న వయసును ఆపడం ఎవరి తరం కాదు. కానీ పెరిగిన వయసు తాలూకు మార్పులను కనిపించకుండా చేయడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ముఫ్ఫై ఏళ్ల వయసు వచ్చే సరికి ముఖంలో వయసు పెరిగిన ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. కొందరికైతే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారు కొన్ని చిన్నపాటి చిట్కాలను పాటిస్తే వయసు పెరిగినా ఇంకా చిన్న వయసు ఉన్నవారిలాగే కనిపిస్తారు. అంటే ముఫ్ఫై ఏళ్లయినా ఇరవై ఏళ్లలాగా కనిపిస్తారు. ఈ చిట్కాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన ఆహార నియమాలు.
మనం ఆరోగ్యంగా కనిపించాలంటే చక్కటి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వయసు ఛాయలు కనిపించకుండా ఉండాలనుకునేవారు ఉడికించిన ఆహారంకన్నా పండ్లు, కాయగూరల్ని సలాడ్ల రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల వాటిలోని పోషకాలు పుష్కలంగా శరీరానికి లభిస్తాయి. అలాగే వంటకు ఆలివ్ నూనెను వాడడం మంచిది. చర్మాన్ని, కేశాలను రక్షించుకోవడంకోసం సన్‌స్క్రీన్‌ను, హెయిర్ కండిషనర్లను ఉపయోగించండి. చక్కగా కంటినిండా నిద్రపోవాలి. నిద్రపోవడం వల్ల శరీరానికి కావలసినంత విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. అతిగా మేకప్ వేయకుండా లైట్‌గా వేసుకోండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. మనసుల్లో ఇతరత్రా ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి, రాత్రిపూట త్వరగా నిద్రపోయి ఉదయం తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. ధ్యానం చేయడం, ఆప్తుల వద్ద మనసువిప్పి మాట్లాడడం వంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే వయసు ప్రభావాన్ని మీపై పడకుండా కట్టడి చేయవచ్చట.