: ఎండలో వెళ్లేవారికి లోషనే మంచిది!


మీరు ఎండలో ఎక్కువగా తిరగాల్సి ఉందా... అయితే చక్కగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ను రాసుకుని వెళ్లండి. దీనివల్ల భవిష్యత్తులో మీకు చర్మక్యాన్సర్‌ రాకుండా కూడా ఉంటుందట. సన్‌స్క్రీన్‌ లోషన్‌కు చర్మక్యాన్సర్‌ను అడ్డుకునే సామర్ధ్యం కలదని పరిశోధకులు చెబుతున్నారు. సన్‌స్క్రీన్‌ లోషన్‌ను చర్మానికి రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కొందరు సన్‌స్క్రీన్‌ లోషన్‌ను రాయడానికి వెనుకాడుతుంటారు. దానివల్ల చర్మానికి ఏమైనా హాని జరుగుతుందేమోనని భయపడుతుంటారు. కానీ సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయడం వల్ల అది సూర్యుని అతినీలలోహిత కిరణాలనుండి చర్మానికి రక్షణ కల్పించడమే కాకుండా చర్మ క్యాన్సర్‌తో పోరాడే జన్యువును కాపాడుతుందని పరిశోధనల్లో తేలింది.

చర్మంపైన ఉండే 'పీ53' అనే జన్యువు చర్మ క్యాన్సర్‌ రాకుండా క్యాన్సర్‌ కారక క్రిములతో పోరాడుతుంది. అయితే ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఈ జన్యువుకు హాని కలిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో ఎండల్లో ఎక్కువగా తిరిగేవారు సన్‌స్క్రీన్‌ లోషన్‌ను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఎండలో తిరిగేవారికి సూర్యుని అతినీలలోహిత కిరణాలవల్ల చర్మం కమిలిపోవడం జరుగుతుంది. దీనికి పరిష్కారంగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ను రాసుకుని వెళితే ఆ సమస్యను తగ్గించవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది చర్మ క్యాన్సర్‌ను నిరోధిస్తుందా అనే విషయంపై పరిశోధకులకు ఇంతకాలంగా అనుమానాలుండేవి. కానీ ఈ పరిశోధన ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేసింది. క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లో సన్‌స్క్రీన్‌ లోషన్‌ మంచి ఫలితాలనిస్తుందని తేలింది. ఎండకు కమిలిన చర్మాన్ని 'పీ53' అనే జన్యువు మరమ్మత్తు చేసి తిరిగి మామూలుగా చేస్తుంది. తరచూ ఎండలో తిరిగే వాళ్లలో ఈ జన్యువు నెమ్మదిగా పనిచేయడం మానేస్తుంది. ఈ క్రమంలో చర్మక్యాన్సర్‌ వచ్చే ప్రమాదముంది. ఇలాంటివారికి 30 కంటే ఎక్కువ స్థాయిలో 'సన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌)' ఉండే సన్‌స్క్రీన్‌ లోషన్‌ 'పీ53' జన్యువుకు రక్షణ కల్పిస్తుందని, ఫలితంగా చర్మక్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుందని ఈ అధ్యయనంలో తేలింది.

  • Loading...

More Telugu News