: మీకు మధ్యాహ్న సమయంలో బద్దకంగా ఉందా?


కొందరు రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపిస్తుంటారు. మరికొందరికి ఉదయం లేచింది మొదలు పొద్దుపోయేవరకూ వారి ముఖంలో ఉత్సాహం అనేది మచ్చుకైనా కనిపించదు. ఎప్పుడూ విసుగు నిండిన ముఖంతో కనిపిస్తుంటారు. ఇంట్లోనే ఉండే ఆడవారికే కాదు, ఉద్యోగినులకైనా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించే వారంటేనే అవతలివారు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో చాలామంది నిద్రకు అలవాటై ఉంటారు. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉండేవారికి ఇది పెద్ద సమస్యగా ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలట. ఇక రోజంతా ఉత్సాహం మీ వెంటే ఉంటుందట.

చాలామందికి మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర పోవడం అలవాటుగా ఉంటుంది. దీంతో ఎక్కడున్నా భోజనం కాగానే నిద్ర ఆగకుండా వస్తుంది. ఈ నిద్రను అదుపు చేయడానికి మన ఆహారంలో మార్పులు చేసుకుంటే సరి. భోజనం సుష్టుగా లాగించకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని కొంత మోతాదులో తీసుకున్నా సరిపోతుంది. పోషకాలతో కూడివుంటుందిగనుక కొంత తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని ఫలితంగా భుక్తాయాసం లేకుండా ఉంటుంది. నిద్ర దూరంగా ఉంటుంది. అలాగే భోజనం తర్వాత కొంతసేపు మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి. ఐదు లేదా పది నిమిషాల పాటు ఇలా సంగీతాన్ని వినడం వల్ల మీకు నిద్ర పోవాలనే భావన దూరమవుతుంది. భోజనం చేసిన తర్వాత కంప్యూటర్‌ ముందు కూర్చోవడం, టీవీ చూడడం చేయకుండా శరీరానికి శ్రమ కలిగించే పనిలోకి దిగడం మంచిది. చేతుల్ని పైకెత్తడం, ముందుకు చాపడం, అటూ ఇటూ నడవడం, ఎండలో కాస్త తిరగడం వంటివి చేయడం వల్ల కండరాలు విశ్రాంతిగా ఉంటాయి. దీని ఫలితంగా శరీరం, మనసు ఉల్లాసంగా మారతాయి. తోటి ఉద్యోగులతో కాసేపు మాట్లాడినా కూడా మంచి ఫలితమే ఉంటుంది. లేదా చక్కటి కాఫీ లేదా టీ తాగితే ఇక నిద్ర మత్తు ఫట్‌మంటూ వదిలిపోతుంది. చక్కగా ఉల్లాసంగా ఉండవచ్చట.

  • Loading...

More Telugu News