: సీఎంపై దినేశ్ రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపాటు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ డీజీపీ దినేశ్ రెడ్డిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దినేశ్ రెడ్డి ఆ వ్యాఖ్యలకు సిగ్గుపడాలన్నారు. సీఎం తమ్ముడు భూదందాలు చేస్తుంటే అప్పుడు కళ్లు మూసుకుని కూర్చున్నావా? అని నిలదీశారు. పదవిలో ఉన్నప్పుడు ఏమీ చెప్పకుండా కూర్చుని ఇప్పుడు మాట్లాడితే నమ్మేదెవరు? అని ప్రశ్నించారు. దినేశ్ రెడ్డి తీరు పోలీస్ వ్యవస్థపైనే నమ్మకం పోయేలా ఉందన్నారు. పదవి పొడిగించలేదని ఆయన తన అక్కసును వెళ్లగక్కారని జగ్గారెడ్డి అన్నారు. అటు మంత్రి శైలజానాథ్ కూడా దినేశ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. పదవి పొడిగించి ఉంటే ఇలా మాట్లాడేవారు కాదన్నారు. ఆయన గురించి త్వరలోనే అంతా బయటపడుతుందన్నారు.