: విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలి: బొత్స


విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సూచించారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి క్షీణిస్తోందన్నారు. రాష్ట్ర విభజనను కోరిన రాజకీయ పార్టీలు సమన్యాయం పేరుతో దీక్షలకు వెళుతున్నందున, విభజనపై మరోసారి ఆలోచించాలని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. ముందు విభజనకు అనుకూలంగా ఉత్తరాలిచ్చిన పార్టీలన్నీ యూటర్న్ తీసుకుని సమన్యాయం అంటున్నందున వారితో చర్చలు జరపాలని హైకమాండ్ ను కోరారు.

ఉద్యమాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులకు పాల్పడకుండా, సంయమనంతో వ్యవహరించాలని ఆయన ఉద్యమకారులను కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర రోజులుగా విజయనగరం జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, నిన్నటి నుంచి శాంతి నెలకొందని తెలిపారు. శాంతిభద్రతలు పోలీసుల కర్తవ్యం అని, అయితే, అరెస్టులు చేసేటప్పుడు పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. విజయనగరానికి కర్ఫ్యూ అనుభవం కొత్తని చెబుతూ, ప్రజలు బయటకు వచ్చినా వారిపై దాడులు చేయొద్దని, వారికి సహకరించాలని ఆయన పోలీసులను కోరారు. కేంద్ర ప్రభుత్వం సమన్యాయం అంటున్న పార్టీల కోరికలను తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News