: గైర్హాజరీని ముందుగానే తెలుసుకోవచ్చు


ఒక పెద్ద కంపెనీలోని ఉద్యోగులు ఎప్పుడెప్పుడు లీవులు పెడతారు? అనే విషయం ముందుగానే తెలుసుకునే వీలుంటుందా...? ఎవరు ఎప్పుడు లీవు పెడతారు? అనే విషయం ఎవరూ ముందుగా ఊహించలేరు. అయితే పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఎప్పుడు లీవులుపెడతారు? అనే విషయాన్ని ఇట్టే అంచనావేసి చెప్పే ఒక సరికొత్త సాఫ్ట్‌వేర్‌ని పరిశోధకులు రూపొందిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా మీ సిబ్బంది ఎప్పుడు ఫోన్‌చేసి లీవు పెట్టే అవకాశం ఉందో ఇట్టే చెప్పేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో తక్కువ సిబ్బంది కారణంగా పనులు నిలిచిపోకుండా తగు సిబ్బంది ఉండేలా కంపెనీలు ముందు జాగ్రత్త తీసుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఒక కంపెనీలో ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో లీవులు ఎప్పుడు పెడతారు? అనే విషయాన్ని ముందుగానే ఊహిస్తే అప్పుడు ఉద్యోగుల గైర్హాజరు కారణంగా పనికి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయాలను కంపెనీ వారు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా ఉద్యోగులు సెలవులు ఎప్పుడు పెడతారు? అనే విషయాలను ముందుగానే ఊహించే ఒక సరికొత్త నమూనాను బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. లాంసెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఉద్యోగులు ఎలాంటి సందర్భాల్లో గైర్హాజరవుతారనే విషయంలో విస్తృత సమాచారాన్ని సేకరించి దాన్ని సునిశితంగా విశ్లేషించారు.

ఈ విశ్లేషణ ప్రకారం పెద్ద ఎత్తున ఆటలపోటీలు జరుగుతున్న సందర్భాల్లోను, వాతావరణం బాగాలేని సమయాల్లోను, ఫ్లూ వంటి వ్యాధులు బాగా ప్రబలివున్న సమయాల్లోను ఎక్కువగా సెలవులు పెడుతుంటారని గుర్తించారు. ఈ విషయాలను గురించి డాక్టర్‌ పీటర్‌ నీల్‌ మాట్లాడుతూ ఈ నమూనాల సహాయంతో పలు సంస్థలు ఇలాంటి సమయాల్లో తగినంతమంది సిబ్బంది అందుబాటులో ఉండేలా ముందుగానే జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. గైర్హాజరీ నమూనా సాఫ్ట్‌వేర్‌ రూపొందించేందుకు బిజినెస్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ అనే సంస్థ వారు ఇచ్చిన సహకారంతో పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

  • Loading...

More Telugu News