: జగన్, టీఆర్ఎస్ పై ఎర్రబెల్లి వ్యాఖ్యలు
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలను మోసం చేసిన జగన్.. తాజాగా దొంగ దీక్షల పేరుతో సీమాంధ్రులను మోసం చేస్తున్నారా? అని అడిగారు. రాత్రి రెండు గంటల వరకు ఇంట్లో ఉండి వచ్చిన జగన్ ది కూడా ఓ దీక్షేనా..? అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై సోనియాగాంధీ ఆడే ఆటలో టీఆర్ఎస్ పావుగా మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం లేఖ ఇచ్చినా టీఆర్ఎస్ ఎప్పుడూ ఆ విషయాన్ని ప్రస్తావించకపోగా, తమపైనే విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.
అసలు తెలంగాణపై అఖిలపక్ష సమావేశం పెట్టమంది తామేనని చెప్పారు. ఆనాడు వైఎస్ తెలంగాణను కొల్లగొడుతుంటే టీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయని టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో అన్నారు. విభజన విషయంలో ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి చర్చలు జరపాలని కోరుతున్నామని.. అందులో తప్పేంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు కోసం బాబు నేతృత్వంలో తామంతా పని చేశామని, బయ్యారం గనులపైనా తీవ్రస్థాయిలో ఉద్యమించామన్నారు.