: ముర్రుపాలు ఇవ్వడం మానకండి
అప్పుడే పుట్టిన పిల్లలకు ముర్రుపాలు పట్టించడం వల్ల వారిలో చక్కటి రోగనిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహజంగా చాలామంది ముర్రుపాలను పట్టించకుండా అశ్రద్ధ చేస్తుంటారు. కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు ముర్రుపాలను పట్టించడం వల్ల వారిని తర్వాత కాలంలో ప్రాణాపాయం నుండి తప్పించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ముర్రుపాలు అందక సుమారు 13 శాతం మంది శిశువులు చనిపోతున్నారని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జాతీయ సదస్సులో పలువురు నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పుట్టిన శిశువుకు ముర్రుపాలు తాగించడంతోబాటు ఆరునెలల వరకూ పిల్లలకు తల్లిపాలను ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ముర్రుపాలు తాగని పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గి, అనారోగ్యానికి గురవుతారని, చివరికి మృత్యువాత పడే ప్రమాదం కూడా ఉందని వారు అంటున్నారు. హైదరాబాద్‌లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వారు 'శిశువులు, ఎదిగే పిల్లల్లో పోషణ' అనే అంశంపై మూడురోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సులో నిపుణులు ఈ విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు.