: సోమవారం నుంచి ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తాను: చంద్రబాబు నాయుడు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి ఢిల్లీలో నిరాహార దీక్షకు కూర్చోనున్నానని తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన కొన్ని క్షణాల క్రితం మాట్లాడుతూ, గతంలో తాము ఢిల్లీ వెళ్లి విభజన విషయంలో ప్రజల వేదనను అర్థం చేసుకోమని చెప్పామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ వేసిన ఆంటోనీ కమిటీ ఏం పని చేసిందని బాబు నిలదీశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏ మూలకు పోయిందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ పార్టీలతో లాలూచీ పడి కాంగ్రెస్ ఈ విభజన నిర్ణయం తీసుకుందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ప్రాంత ప్రయోజనాల కోసం మరో ప్రాంత ప్రజల కడుపుకొట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే పదవులకు ఆశపడి తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కనీసం స్వంత పార్టీ నేతలతోనైనా చర్చించిందా? అని ఆయన అడిగారు. సున్నిత సమస్యను పరిష్కరించే విధానం ఇదేనా? అని నిలదీశారు. తాము చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నట్టు ప్రజలతోనూ, పలు సంఘాలతోనూ చర్చలు చేశారా? అని అడిగారు.
తాను తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రలో ప్రజల మనోభావాలు తెలుసుకున్నానని తెలిపారు. ఢిల్లీలో విభజన అంశంలో రాష్ట్రపతితో సమావేశమయ్యానని గుర్తు చేశారు. రెండు ప్రాంతాలకూ అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అందుకే తాను రెండు ప్రాంతనేతలను, ప్రజాసంఘాలను పిలిపించి న్యాయం చేయమని కోరామన్నారు. అత్యవసర సమస్యలను టేబుల్ ఐటెంగా తీసుకురావడానికి ఏ కారణాలు ప్రేరేపించాయో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని బాబు డిమాండ్ చేశారు. దేశ సమగ్రతకు సమస్యగా మారిన తీవ్ర సమస్యను అజెండా ఐటెంగా ప్రవేశ పెడితే దానిపై సమగ్ర స్టడీ ఉంటుందనే నెపంతోనే, దానిని టేబుల్ ఐటెంగా ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. అందుకే, దీనిని నిరసిస్తూ తాను సోమవారం నుంచి ఢిల్లీలో నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.