: మాది తెలంగాణ వాదమే: ఎర్రబెల్లి
టీడీపీ అధినేత చంద్రాబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టనున్న దీక్షపై ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతల్లో గుబులు రేగుతోంది. ఇది తమ తెలంగాణా వాదానికి ఎక్కడ నష్టం కలిగిస్తుందోనని తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు దీనిపై ఈ రోజు మాట్లాడుతూ, సమైక్యానికి మద్దతుగా నిరాహార దీక్ష చేయవద్దని, సీమాంధ్ర ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని సూచించినట్టు తెలిపారు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై తమ అధినేత పోరాటం చేయడపై తమకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీది తెలంగాణ వాదమని, అందులో సందేహం లేదని ఆయన అన్నారు. విద్యుత్, నీరు, వనరులు, ఉద్యోగాలు వంటి సమస్యలపై న్యాయపరమైన వాటా కోసం తమ పార్టీ అధినేత నిరాహార దీక్ష చేస్తే తమకు అభ్యంతరం లేదన్న ఆయన, 'సమైక్యాంధ్ర' కోసం అనే అర్థం వచ్చేలా దీక్ష చేస్తే బాగుంటుందని సీమాంధ్ర టీడీపీ నేతల అభిప్రాయమని ఎర్రబెల్లి తెలిపారు.