: 2015 వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన ఆఫ్ఘనిస్థాన్
ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ప్రపంచకప్ కు క్రెకెట్ పసికూన ఆఫ్ఘనిస్థాన్ అర్హత సాధించింది. నిత్యం తాలిబన్లు, నాటో దళాల దాడులతో హోరెత్తిపోయే ఆఫ్ఘాన్... తన చరిత్రలో మొట్టమొదటిసారి ప్రపంచ కప్ క్రికెట్ కు క్వాలిఫై అయింది. షార్జాలో జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్ షిప్ లో కెన్యాను ఓడించి రెండో స్థానంలో నిలవడంతో.... ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచ కప్ కు అర్హత సాధించింది.
ఈ రోజు జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్ కెన్యాను 43.3 ఓవర్లలో 93 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం 94 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 20.5 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో టోర్నీలో 19 పాయింట్లతో ఆఫ్ఘనిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 24 పాయింట్లతో ఐర్లండ్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోడంతో పాటు వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. 2015 లో ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ ప్రపంచ కప్ లో ఓవల్ మైదానంలో ఆఫ్ఘనిస్థాన్ తన మొట్టమొదటి మ్యాచ్ లో బాంగ్లాదేశ్ ను ఢీకొనబోతోంది.