: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాంతో, తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఐదు రాష్ట్రాల్లో లక్షా 30వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్.సంపత్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఈ రాష్ట్రాల్లోని ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటింగు ఈవీఎంల ద్వారా జరుగుతుందన్నారు.
ఛత్తీస్ గఢ్ లో ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఇక్కడ రెండు దశల్లో నవంబర్ 11, 19న ఎన్నికలు జరుగుతాయనీ చెప్పారు. మధ్యప్రదేశ్ లో నవంబర్ 25న పోలింగ్, రాజస్థాన్ లో డిసెంబరు 1న పోలింగ్ ఉంటుందన్నారు. ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 9న విడుదలవుతుందనీ, డిసెంబర్ 4న పోలింగు జరుగుతుందనీ చెప్పారు. ఇక మిజోరంలో డిసెంబరు 4న పోలింగు జరుగుతుంది. చివరికి డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల ఓట్లను లెక్కిస్తారని తెలిపారు.