: పార్టీలన్నీ రాజకీయ జేఏసీగా ఏర్పడాలి: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు
విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్రలోని పార్టీలన్నీ రాజకీయ జేఏసీగా ఏర్పడి బిల్లును అడ్డుకోవాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సూచించారు. సమైక్య ఉద్యమంలో పాల్గొనకపోతే ప్రజాప్రతినిధులు ధ్రోహులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్ర కేబినెట్ దొడ్డిదారిన నిర్ణయం తీసుకుందని, ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి వస్తుందని, అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారన్నారు. అదేమీ లేకుండా, అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలసిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాలకు అనుకూలమన్న బీజేపీ.. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. టీ-నోట్ వెనక్కి తీసుకోవడం సాధ్యమేనన్నారు. నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ఉద్యోగులు అరగంట పాటు నిరసన చేస్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. నిరసన చేస్తున్న మహిళలని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేశారని ఆగ్రహించారు.