: భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టు రేపటి నుంచి


భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ రేపటి నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఈ పోరుకు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. తొలి టెస్టు నెగ్గిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా సమరోత్సాహంతో కదం తొక్కుతుండగా.. ప్రతీకారేచ్ఛతో ఆసీస్ రగిలిపోతోంది.

స్పిన్ కు  అనుకూలించే చెన్నై పిచ్ పై భారత బౌలర్లు అశ్విన్, జడేజా, హర్భజన్ కంగారూలను హడలెత్తించారు. అది చాలదన్నట్టు తన విధ్వంసక బ్యాటింగ్ తో కెప్టెన్ ధోనీ.. క్లార్క్ బృందానికి కడగండ్లు మిగిల్చాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో తమ సత్తా చూపాలని ఆసీస్ శిబిరం తహతహలాడుతోంది.

రెండో టెస్టుకు భారత జట్టు విషయానికొస్తే.. ఒకే ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. చెన్నైమ్యాచ్ లో పెద్దగా వికెట్లు తీయని భజ్జీ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఓజా ఎంపికకే ధోనీ మొగ్గు చూపవచ్చు. తొలి టెస్టులో 12 వికెట్లు తీసిన అశ్విన్ నుంచి భారత వ్యూహకర్తలు మరోమారు అలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారు.

ఇక ఆసీస్ ఇద్దరు స్పిన్నర్లను ఈ మ్యాచ్ లో ఆడించాలని తలపోస్తోంది. ఇక్కడా స్పిన్ పిచ్ తప్పకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో ఆఫ్ స్పిన్నర్ లియాన్ కు జతగా ఎడమచేతివాటం డోహెర్టీని రంగంలోకి దింపనున్నారు.

బ్యాట్స్ మెన్ రాణిస్తే బౌలర్ల పని సులువౌతుందని క్లార్క్ భావిస్తున్నాడు. అయితే, చెన్నైలో టాపార్డర్ ఘోర వైఫల్యం ఆ జట్టు అనుభవ లేమిని సూచిస్తోంది. దీంతో, అనుభవజ్ఞుడైన ఓపెనర్ వాట్సన్ శుభారంభం ఇవ్వాలని ఆ జట్టు కోరుకుంటోంది.

పిచ్ పేస్ కు అనుకూలించే పక్షంలో చెలరేగేందుకు ప్యాటిన్సన్, సిడిల్ సిద్ధంగా ఉన్నారు. ఈమ్యాచ్ లో తాము ఓటమిపాలైతే భారత్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళుతుందని ఆసీస్ కు తెలియందికాదు .అందుకే సర్వ శక్తులు ఒడ్డి ఈ టెస్టులో నెగ్గి సిరీస్ సమం చేయాలని కంగారూలు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News