: విభజన ముందు తొందరపాటు.. ఉపయోగంలేని భేటీలు!
తెలంగాణపై నిర్ణయాన్ని అధిష్ఠానానికి కట్టబెట్టిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు తొందరపడటం... చూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించకమానదు. తమ చేతుల్లో ఏ మాత్రం లేని నిర్ణయాన్ని... ఉపయోగం లేని భేటీలు, సమావేశాలతో ఎంతమాత్రం ఆపలేరన్నది వాస్తవం. అయినా, రోజుకు నాలుగు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించుకోవడం, మాట్లాడుతున్నామనడం... చేజారిన తర్వాత చేపట్టే దిద్దుబాటు చర్యల్లా కనిపిస్తున్నాయి. పాపం.. ఈ మాత్రం ప్రయత్నాలన్నా చేయకపోతే ప్రజలు తమను దుమ్మెత్తి పోస్తారని సీమాంధ్ర నేతలు అనుకుంటున్నట్టున్నారు. వీరు సమావేశాలతో ఏం సాధించలేరన్నది మరో సత్యం.
విభజనపై వెనక్కి వెళ్లలేనంత ముందుకు వెళ్లిన కేంద్రం సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమాలతో నిర్ణయాన్ని మార్చుకోదు. ఇదే నిజం. సీమాంధ్రలో ఉద్యమం అరవై రోజులుగా కొనసాగుతున్నా... ఖ్యాతి గడించిన నాయకులు చీమ కుట్టినట్టైనా లేకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు, లేదంటే కార్యాలయాల్లో నలుగురైదుగురితో సొల్లు మీటింగులు పెట్టుకుని తీరిగ్గా మాట్లాడుకోవడం. గత కొంత కాలంగా ఇదే పరిస్థితి. ఇక సీమాంధ్ర ఎంపీల విషయానికొస్తే ఏపీఎన్జీవోలు డిమాండ్ చేసిన చాలా రోజులకి తూతూ మంత్రంగా రాజీనామా చేశారు. అవి కూడా ఆమోదం పొందలేదు. వాటివల్ల ఏ ఉపయోగం లేకపోయినా అధిష్ఠానాన్ని గట్టిగా ఎదురించే దమ్ము వీరికి లేదు. ఈ సాయంత్రం తెలంగాణ నోట్ కేబినెట్ భేటీలో ప్రవేశపెడతారని తెలిసినా పదవీ వ్యామోహం తీరని మన నేతలు... తమ స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారన్నది ఘంటా పథంగా చెప్పాల్సిన నిజం.
ఇక విభజన ప్రకటన నాటి నుంచి ఇప్పటివరకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు లెక్కలేనన్ని సార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో కూడా కొంతమంది రాజీనామాలు చేస్తే ఇంకొంతమంది చేయమంటారు. నిజంగా రాజీనామా చేస్తే విభజన ఆగుతుందా? లేక సమష్టిగా అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తే సమస్యకు పరిష్కారం వస్తుందా? అనేది వారికే తెలియాల్సిన విషయం. ఇవేవి లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మన నేతలు ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టం!