: అమెరికాలో సమైక్యాంధ్ర వనభోజనాలు
అమెరికాలోని డాలస్ లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక లూయివిల్లి పార్కులో సమైక్యాంధ్ర వనభోజనాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీమాంధ్ర ఎన్నారైలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరంతా ఈ కార్యక్రమానికి జై సమైక్యాంధ్ర టీ షర్టులు ధరించి వచ్చారు. సభాస్థలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెలుగుతల్లి విగ్రహం వద్ద... రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నినాదాలు చేశారు. కార్యక్రమానికి హాజరైన వారితో ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ... విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులు సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేయడం... తమకు ఎంతో ఉత్తేజాన్ని అందిస్తోందని అన్నారు.
సభలో ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ... అమెరికాలో ఉన్న తెలుగువారి మాదిరిగా రాష్ట్రంలో కూడా సమైక్యతాభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులకు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ వంటకాలను వడ్డించారు.