: ఇప్పటికీ అదే ప్రేమ


అభిషేక్ బచ్చన్.. తెరంగేట్రం చేయకముందే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడిగా లైమ్ లైట్లో నిలిచిన వ్యక్తి. ఐశ్వర్యారాయ్.. మిస్ వరల్డ్ గా భారత్ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన అందాలరాశి. అప్పట్లో వీరి లవ్ అఫైర్ అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమ పేరుతో ఒక్కటయ్యారనే కంటే ప్రేమే వీళ్ళిద్దరినీ ఒక్కటి చేసిందనడం సబబు. ఇద్దరూ సినీ రంగంలోనే ఉన్నా.. అప్పటికే ఐశ్వర్యకు సల్మాన్ తో ప్రేమాయణం బెడిసికొట్టిందన్న వార్తలు బాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. ఇటు చూస్తే, బాలీవుడ్ కు పెద్ద దిక్కులాంటి అమితాబ్ కుటుంబం. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఒక్కటయ్యారంటే అందుక్కారణం నిష్కల్మషమైన ప్రేమే కదూ.

ఇక, పెళ్ళితో ప్రేమకు ఫుల్ స్టాప్ పడుతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. అది తప్పని నిరూపించారీ బాలీవుడ్ కపుల్. టీటీకే గృహోపకరణాల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లయిన వీరిద్దరూ తాజాగా ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారిద్దరూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటున్న పోజుతో రోమియో జూలియెట్ ను తలపించారు. ఒకరిపై మరొకరికి ఉన్న అచంచల విశ్వాసం వారి చూపుల్లో వ్యక్తమైంది.

ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. ఐశ్వర్యను ఎలా లాలిస్తావంటూ కొందరు తనను ఓ ప్రశ్న తరచూ అడుగుతుంటారని చెప్పాడు. కొన్ని ప్రేమపూర్వక మాటలు, మరికొన్ని అనురాగ పూరిత చూపులు, తమకు మాత్రమే పరిమితమైన సంజ్ఞలతో ఐశ్వర్య పట్ల తన లాలిత్యాన్ని ప్రదర్శిస్తానని విడమర్చాడు. దీనికి ఐశ్వర్య వెంటనే స్పందిస్తూ, అందుకే అభిషేక్ ను పెళ్ళాడానని మురిసిపోతూ చెప్పింది. 2007లో వివాహం చేసుకున్న ఈ జంట 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చారు. వారి వైవాహిక జీవితంలో ఒక్కసారి కూడా భేదాభిప్రాయాలు రాలేదని, అదే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనమన్నది వారి సన్నిహితుల మాట.

  • Loading...

More Telugu News