: బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవిని వదలాల్సిందే
అమెరికా అపర కుబేరుడు, సాఫ్ట్ వేర్ రంగంలో రారాజు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి తెలియని వారెవరూ ఉండరు. తన విండోస్ ఉత్పత్తులతో ప్రపంచ కంప్యూటర్ రంగాన్ని గుప్పెట్లో ఉంచుకున్న బిల్ గేట్స్ ఇప్పుడు పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ టాప్ 20 ఇన్వెస్టర్లలో ముగ్గురు... బిల్ గేట్స్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలని బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే బోర్డు సభ్యులు ఇంకా దీనిపై స్పందించలేదు.
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో బిల్ గేట్స్ కు 4.5 శాతం వాటా ఉంది. కంపెనీలో అత్యంత ఎక్కువ వ్యక్తిగత వాటా కలిగిన వ్యక్తి బిల్ గేట్సే. ఆయనపై వ్యతిరేక బావుటా ఎగరవేసిన ముగ్గురు ఇన్వెస్టర్ల మొత్తం వాటా 5 శాతం. గేట్స్ కంపెనీ షేరు విలువను పెంచే ప్రయత్నం చేయకుండా.. తాను స్థాపించిన మిలిండా గేట్స్ ఫౌండేషన్ కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని వీరు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా 2000 నుంచి కంపెనీ సీఈఓగా పనిచేస్తున్న బామర్ కు వారసుడిని వెతికే పనిలో గేట్స్ ఉన్నాడని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కంపెనీకి కొత్త సీఈఓ వస్తే బామర్ ప్రణాళికలన్నీ పనికిరాకుండా పోతాయని వాదిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బిల్ గేట్స్ ను తప్పించడమే మేలని తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.