: ఆ యూనిఫాంలో ఏదో ప్రత్యేకత ఉంది: ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆట విడుపు దొరికితే చాలు బైక్ పై రివ్వున షికారుకెళ్ళడం, లేకుంటే బంధుమిత్రులతో రాంచీ సమీపంలోని కలిసి గుళ్ళూగోపురాలు సందర్శిస్తుంటాడు. తాజాగా, చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో చెన్నయ్ సూపర్ కింగ్స్ సెమీస్ కు క్వాలిఫై కాగా, కొద్దిరోజులపాటు ధోనీకి విరామం లభించింది. దీంతో, ధోనీ రాంచీ పారాచ్యూట్ రెజిమెంట్ ను సందర్శించాడు.
అక్కడ ఓ రోజు గడిపిన ఈ జార్ఖండ్ డైనమైట్ మీడియాతో మాట్లాడుతూ, తాను మొదట జవాను అవ్వాలనుకున్నానని తెలిపాడు. చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండేదని చెప్పుకొచ్చాడు. అసలు మిలిటరీ యూనిఫాంలోనే ఏదో ప్రత్యేకత ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. అయితే, తానెప్పుడు ఆ దుస్తులు ధరించడానికి భయపడలేదని చెప్పాడు. ఏదో ఒక రోజు జవాను అవుతానన్న నమ్మకం ఉండేదని పేర్కొన్నాడు. కాగా, అక్కడి జవానులు, వారి కుటుంబ సభ్యులతో టీమిండియా కెప్టెన్ ధోనీ ఫొటోలకు పోజులిచ్చాడు.