: మావోయిస్టులతో చేతులు కలిపిన ఇండియన్ ముజాహిదీన్?


వరుస బాంబు పేలుళ్లతో దేశంలో అలజడి రేపుతున్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ.. మావోయిస్టులతో చేతులు కలిపిందా? అంటే, ఔననే అంటున్నారు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ (NIA) అధికారులు. ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన కరడుగట్టిన తీవ్రవాది భత్కల్ ను విచారించే సమయంలో వారికి కొన్ని నిజాలు తెలిశాయి. దాంతో వారు ఈ అంచనాకు వచ్చారు.

భత్కల్ అరెస్ట్ కాకముందు... నేపాల్ లో గడిపిన సంగతి తెలిసిందే. అరెస్ట్ కు ఐదు నెలల ముందు... ఒక మావోయిస్టు నాయకుడిని నేపాల్ లో కలిశానని భత్కల్ ఎన్ఐఏ అధికారులకు తెలిపాడు. అతని పేరు మంజర్ (అలియాస్) అని చెప్పాడు. అతడిని నేపాల్ లోని హర్సాహి అనే ప్రాంతంలో కలిసినట్టు భత్కల్ వెల్లడించాడు. దీంతో మావోయిస్టులతో ఇండియన్ ముజాహిదీన్లకు సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు.

దీనికి తోడు, ముజాహిదీన్లకు, మావోయిస్టులకు మధ్య కొంత సారూప్యత ఉందని ఎన్ఐఏ భావిస్తోంది. ముజాహిదీన్ల పేలుళ్లు, మావోయిస్టుల పేలుళ్లు ఒకేలా ఉంటాయని అంచనా వేసింది. కేంద్ర హోం శాఖ అధికారులు కూడా ఇదే అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే బుద్ధ గయలోని పేలుళ్లతో మావోయుస్టులకు సంబంధం లేదని భక్తల్ తెలిపినట్టు సమాచారం.

మావోయిస్టులు, ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు పరస్పరం సహకరించుకుంటున్నారని ఎన్ఐఏ భావిస్తోంది. ఇండియన్ ముజాహిదీన్ల పేలుళ్లకు మావోయిస్టులు పేలుడు పదార్థాలు సమకూరుస్తున్నారని అనుమాన పడుతోంది. అలాగే, మావోయిస్టులకు ఇండియన్ ముజాహిదీన్ ఆయుధాలను సమకూర్చుతోందని భావిస్తోంది. ఈ అనుమానాలు నిజమైతే.. మన దేశ భద్రత మరింత క్లిష్టంగా మారినట్టే!

  • Loading...

More Telugu News