: నడుము బిగిస్తే గొంతుకు ప్రమాదం!!


నాజూకైన నడుమును మరింత నాజూకుగా కనిపించేలా చాలామంది బెల్టు పెట్టుకుంటుంటారు. ఈ బెల్టులు ఏదో కాస్త బిగుతుగా అయితే ఫరవాలేదుగానీ మరింత సన్నగా నడుము కనిపించాలని కోరుకుని వీలైనంత బిగుతుగా బెల్టును బిగించేవారికి మాత్రం ఇది హెచ్చరికే. ఎందుకంటే బిగుతుగా నడుమును బెల్టుతో బిగించేవారికి గొంతు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందట. ఈ విషయం శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఇలా బిగించేవారిలో ముఖ్యంగా ఊబకాయులకు ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నడుముకు బెల్టు ధరించడం నేడు ఫ్యాషనైపోయింది. అయితే ఊబకాయులు నడుముకు అతి బిగుతుగా బెల్టును ధరించడం వల్ల ఉదరంలోని ఆమ్లాలు వెనక్కివెళ్లి అన్నవాహికకు చేరుకుంటాయని, ఇది చాలా ప్రమాదమని గ్లాస్గో, స్ట్రత్‌క్లైడ్‌ వర్సిటీలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వీరు సుమారు 24 మందిపై నిర్వహించిన అధ్యయనంలో నడుముకు బిగుతుగా బెల్టు పెట్టుకునేవారికి గొంతు క్యాన్సర్‌ ముప్పు పొంచివుందని తేలింది. వీరిలో అధిక బరువున్న వారిలో నడుముకు బెల్టు బిగించడం వల్ల ఉదర ఆమ్లాలు తిరిగి అన్న వాహికకు చేరినట్లు స్పష్టంగా గుర్తించారు. ఈ విషయాలను గురించి ముఖ్య అధ్యయనకర్త కెన్నెత్‌ మెకోల్‌ మాట్లాడుతూ ఊబకాయులు నడుముకు బెల్టు ధరించడం వల్ల ఉదరం, అన్నవాహికల మధ్య ఉన్న నాళంపై ఒత్తిడి పడుతుందని, ఫలితంగా ఆమ్లాలు అన్నవాహికలోకి చేరుతాయని, ఉదరం లాగా అన్నవాహిక ఆమ్లాలను భరించలేదని దాని ఫలితంగా గొంతు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని తెలిపారు. కాబట్టి నడుము నాజూకుకన్నా ఆరోగ్యం ముఖ్యం కదా... బెల్టును కాస్త వదులుగా బిగిస్తే అన్నివిధాలా మేలేకదా...!

  • Loading...

More Telugu News