: కేసీఆర్ కు హితవు చెప్పిన సీపీఐ నారాయణ
'ఎవరో ఏదో అన్నారని మనం కూడా అనేస్తామా..?' అని కేసీఆర్ ను ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్రలో రోజూ ఏదో అంటున్నారని కేసీఆర్ అనడం విచిత్రంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా తెలంగాణలో కూడా అలాగే అన్నారని గుర్తు చేశారు. ఉద్యమమన్నాక భావోద్వేగాలు ఉంటాయని తెలిపారు. ఆరోపణలు చేస్తున్నారని ఎంతమందికి సమాధానం చెబుతారని అడిగారు. కేవలం కేసీఆర్ బొమ్మనే కాదు, తన బొమ్మను కూడా తగలబెడుతున్నారని నారాయణ చెప్పారు. అదే ప్రాంతంలో పుట్టిన తాను కూడా వారి మాటలను, చర్యలను ఖండించడంలేదని గుర్తు చేశారు.
ప్రజలు అంటున్నారని, స్థాయిని దిగజార్చుకుని ప్రతిదానికీ స్పందించాల్సిన పనిలేదని కేసీఆర్ కు నారాయణ సూచించారు. 'హుందాగా వ్యవహరించి మీ స్థాయిని పెంచుకోండి' అంటూ హితవు పలికారు. తెలంగాణ సాధనకు అందరి సహకారం కావాలి తప్ప, ఏకపక్షంగా వెళతామంటే కుదరదని స్పష్టం చేశారు. ఆ దిశగా కృషి చేయాలే కానీ ప్రజల్ని విమర్శించడం సరికాదని, నేతలుగా చేయాల్సింది అదికాదని నారాయణ పేర్కొన్నారు.