: కేసీఆర్ కు సమైక్య రాష్ట్రం కావాలి.. జగన్ కి విభజన కావాలి: రేవంత్ రెడ్డి
జై తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకున్న కేసీఆర్ కి రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉందని.. సమైక్యాంధ్ర నినాదాన్ని తలకెత్తుకున్న జగన్ కు రాష్ట్రం తక్షణం ముక్కలవ్వాలని ఉందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. సోనియా, విజయమ్మ, కేసీఆర్ లది దురాశాపరుల సమూహమని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవడానికి సోనియా ప్రయత్నిస్తుంటే, జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా విజయమ్మ రాష్ట్రం ముక్కలు చేసేందుకు సై అంటోందని దుయ్యబట్టారు. మరోవైపు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోదామని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
ఈ ముగ్గురు అధికారం, ఆస్తులు సంపాదించడానికి తప్పుడుదారుల్లో నడుస్తూ 8 కోట్ల మంది ప్రజల్ని ఇబ్బందులపాల్జేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ ముగ్గురికీ అధికారం దక్కడం కల్ల అని అన్నారు. అధికారం, ఆస్తులు సంపాదించడానికి ఉద్యమాల్ని నెత్తికెత్తుకున్నారు తప్ప ప్రజా శ్రేయస్సు కోసం కాదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిందని అంటున్న నేతలు సీమాంధ్రుల సమస్యలపై శాశ్వత పరిష్కారానికి పాటుపడాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రం ప్రకటించిన రోజు కేసీఆర్ సర్వం కోల్పోయిన వాడిలా ఉన్నాడని ఎద్దేవా చేశారు.
ఆరోజు మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ ముఖం లంఖణాలు చేసిన వాడి ముఖంలా ఉందని అన్నారు. నిన్న సభలో కూడా కేసీఆర్ ను చూస్తే వరదల్లో సర్వం కోల్పోయిన రైతు గుర్తుకొచ్చాడని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికలొస్తే నోట్లు, ఓట్ల కోసమే ప్రయత్నించాలన్న రీతిలో కేసీఆర్ మతి చలించినట్టుందని అన్నారు. విభజన జరగకుంటే కనీసం 50 శాతం సీట్లను అమ్ముకోవచ్చని కేసీఆర్ భావించాడని.. అవి అమ్ముకుంటే వందో, రెండు వందల కోట్లు వస్తాయనుకున్నాడని, విభజన ప్రకటన రావడంతో ఇప్పుడిలా పిచ్చిప్రేలాపనలు పేలుతున్నాడని అన్నారు.
తెలంగాణ ప్రకటన కేసీఆర్ కు పిడుగులా పరిణమించిందని పేర్కొన్నారు. టీడీపీ తన నిర్ణయానికి కట్టుబడి ఉందని, రాష్ట్రపతికి కూడా అదే వినిపించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు, విద్యార్థులు, నీరు వంటి సమస్యలు ఉన్నాయని.. వాటికి పరిష్కారాలు సూచించాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర రాజధానికి తాము నిధులడిగితే తప్పా? అని ఆయన ప్రశ్నించారు.