: ఇది ప్రపంచానికి సరికొత్త పదార్ధం!!
ప్రపంచమంతా అంగీకరించిన ఒక సిద్ధాంతాన్ని ఇప్పుడు ఒక సరికొత్త పరిశోధన విభేదిస్తోంది. సహజంగా ఫోటాన్లకు ద్రవ్యరాశి ఉండదు. దీంతో అవి ఒకదానితో ఒకటి కలవవు. అయితే శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగంలో ఈ ఫోటాన్లను ఒకదానితో ఒకటి కలిపి ఒక సరికొత్త పదార్ధాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. దీంతో ఈ పదార్ధం ఇప్పటి వరకూ కనుగొన్న పదార్థాలతో పూర్తిగా విభేదిస్తోంది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ మైఖేల్ లూకిన్, ఎంఐటీ భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ వాల్డన్ వ్యూలెటిక్లు తాజాగా నిర్వహించిన ఒక పరిశోధన ఇప్పటివరకూ ప్రపంచమంతా అంగీకరించిన కాంతి సహజగుణాలతో విభేదిస్తోంది. ఈ శాస్త్రవేత్తలు ఫోటాన్లను ఒకదానితో ఒకటి కలిపి ఒక అణువును రూపొందించే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. ద్రవ్యరాశి లేని కారణంగా ఫోటాన్లు ఒకదానితో ఒకటి కలవవు. కానీ ప్రత్యేకమైన మాధ్యమంలో ఫోటాన్లను ప్రవేశపెట్టినప్పుడు అవి ఒకటిగా ఏర్పడుతాయని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ పరిశోధనలో మైఖేల్ లూకిన్ ముందుగా రుబిడియం పరమాణువులను శూన్య గదిలో నింపి అందులోకి లేజర్ కాంతిని పంపి పరమాణు సమూహాన్ని చల్లార్చారు. అందులోకి రెండు ఫోటాన్లను చొప్పించినప్పుడు అవి ఒక్క అణువుగా బయటకు రావడాన్ని లూకిన్ గుర్తించారు. ఇలా ఒక సరికొత్త పదార్ధ రూపాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.