: ఆలోచించే చిట్టి రాబోతున్నాడు...!
చిట్టి రోబో తన యజమాని చెప్పినట్టు చేయడం మాత్రమే తెలిసిన యంత్రుడు. అలా కాకుండా తనకు తానుగా స్వయంగా ఆలోచించగలిగితే... తాను చేసిన తప్పులను తానే సరిదిద్దుకోగలిగితే... సరిగ్గా ఇలాంటి రోబోను తయారుచేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారుచేయడానికి కృషి చేస్తున్నారు.
రోబోలు తమంత తాముగా ఆలోచించగలిగేలా రూపొందించడానికి శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. అమెరికాలోని కొందరు శాస్త్రవేత్తల బృందం ఇలాంటి రోబోను తయారుచేయడానికి కొత్త తరహా ఫీడ్బ్యాక్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా రోబోలు తమను తామే పర్యవేక్షించుకునే వీలుంటుందని, అంటే తాము చేసిన పొరబాట్లను తామే సరిదిద్దుకోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన మిస్సోరి విశ్వవిద్యాలయానికి చెందిన జగన్నాథన్ సారంగపాణి కూడా ఉన్నారు. ఈ రోబోల గురించి సారంగపాణి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రోబోలు మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు ఈ సరికొత్త ఫీడ్బ్యాక్ వ్యవస్థ సహకరిస్తుందని చెబుతున్నారు.