: విశ్వంలో జీవకోటి ఉన్న గ్రహాలు చాలానే ఉన్నాయి!
విశాల విశ్వంలో జీవం ఉండే గ్రహం భూమి ఒక్కటే అనే మనం అనుకుంటుంటాం. అయితే జీవం ఉండే గ్రహాలు చాలానే ఉన్నాయట. గ్రహాంతరవాసులు పలు గ్రహాల్లో నివసిస్తుండే అవకాశాలున్నాయని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా సౌరవ్యవస్థలోనే గ్రహాంతరవాసులు నివసించే 986 గ్రహాలను ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే వీటి సంఖ్యను వెయ్యికి చేరుస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1992లో కొందరు పరిశోధకులు భూమికి సుమారు వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో న్యూట్రాన్ నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు తిరుగుతున్నాయని కనుగొన్నారు. అయినా కూడా గ్రహాంతరవాసులు జీవించే అవకాశం ఉందని ఒక గ్రహాన్ని 1995లో శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇక అప్పటినుండీ గ్రహాంతర వాసులు జీవించే గ్రహాలుగా భావిస్తున్న సుమారు 986 గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన కెఫ్లర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా త్వరలోనే మరిన్ని గ్రహాలను గుర్తించనున్నారని అది కూడా ఈ సంవత్సరంలోనే జరగవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
టెలిస్కోప్ సాయంతో ఇప్పటికే 3,588 గ్రహాలు ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. వాటిలో 90 శాతం వరకూ నిజమైన గ్రహాలుగా భావిస్తున్నారు. అలాగే అంతరిక్షంలోని ప్రతి పాలపుంతకు సరాసరి 1.6 గ్రహాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ గ్రహాంతర వాసులను గురించి సరైన సమాచారం తెలియకపోయినా... గ్రహాంతర వాసులు జీవించే అవకాశం ఉన్న గ్రహాలను పెద్ద సంఖ్యలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు.