: మన్మోహన్ అసమర్థుడు... ఢిల్లీ ర్యాలీలో యూపీఏపై విరుచుకుపడ్డ మోడీ


ఢిల్లీలోని జపనీస్ పార్క్ లో బీజేపీ 'వికాస్ ర్యాలీ' పేరిట ఎన్నికల శంఖారావం మోగించింది. దేశ రాజధానిలో తన బలమెంతో చూపే ప్రయత్నం చేసింది. ప్రధాని అభ్యర్థిగా మోడీ ఢిల్లీలో ప్రసంగిస్తున్న మొట్టమొదటి సభకు అనూహ్య స్పందన లభించింది. ఈ సభకు దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారని అంచనా వేశారు. ఈ సభలో ప్రసంగించిన మోడీ ప్రధానమంత్రితో పాటు యూపీఏ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు.

మన దేశ ప్రధాని చేతకాని అసమర్థుడని నరేంద్ర మోడీ తీవ్ర పదజాలంతో దూషించారు. అన్నిరకాలుగా విఫలమైన ప్రధాని... అమెరికాలో మన దేశ పేదరికాన్ని మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నించారని విమర్శించారు. పేదరికాన్ని సినిమాల్లో చూపి అవార్డులు అందుకునే వారిలా ప్రవర్తించారని దుయ్యబట్టారు. ఒబామా ఎదుట మన్మోహన్ నిస్సహాయత ప్రదర్శించారని తెలిపారు. మన దేశాన్ని వేలెత్తి చూపే అధికారం ప్రపంచంలో మరే దేశానికి లేదని తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వానికి పక్షవాతం వచ్చిందని... అందుకే ఏ పనీ చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ కు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో చర్చలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చర్చలకు ఇది సమయమా? అని అన్నారు. పాక్ తాను పెంచి పోషిస్తోన్న తీవ్రవాదాన్ని ఆపగలదా? అని మన ప్రధాని నవాజ్ షరీఫ్ ని నిలదీయగలరా? అని ప్రశ్నించారు. ప్రధానికి సొంత పార్టీలోనే గౌరవం దక్కకపోతే... బయటి దేశాల్లో గౌరవం ఎలా లభిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని గౌరవాన్నే కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

యూపీఏకు అవినీతి, కుంభకోణాలు అలవాటుగా మారాయని మోడీ ఘాటుగా విమర్శించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా కేంద్ర ప్రభుత్వం తన పనితీరు మార్చుకోవడంలేదని దుయ్యబట్టారు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతికి పాల్పడి దేశం యొక్క పరువు తీశారని మోడీ అన్నారు. యూపీఏ ప్రభుత్వ అసమర్థత వల్లే దేశంలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని తెలిపారు. ఢిల్లీలో ఏం జరిగినా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోదని... మొత్తం కేంద్రంపైనే తోసేస్తుందని దుయ్యబట్టారు. ఇక్కడ రెండు (కాంగ్రెస్, యూపీఏ) ప్రభుత్వాలు ఉండటంతో... ఢిల్లీ నాశనమయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమయిందని మోడీ విమర్శించారు. రైల్వేల అభివృద్ధిలో చైనా... జపాన్ తో పోటీపడుతుంటే... మనమెక్కడ ఉన్నామని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో మన దేశ విమానయాన రంగం రూ. 54 వేల కోట్ల నష్టాల్లోకి జారుకుందని తెలిపారు. యూపీఏ పాలనలో మన దేశాన్ని ప్రపంచ దేశాలు అపహాస్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో తల్లిదో ప్రభుత్వం, కుమారుడిదో ప్రభుత్వం, అల్లుడిదో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు.

ఈ పరిస్థితుల్లో మనకు ఒక సుస్థిర ప్రభుత్వం అవసరమని తెలిపారు. "మన దేశానికి ఒక డ్రీం టీం కావాలి... డర్టీ టీం కాద"ని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News