: లాలూను రక్షించేందుకే ఆర్డినెన్స్: బీజేపీ
నేరచరిత కలిగి ఉన్న ప్రజాప్రతినిధులకు మద్దతుగా యూపీఏ సర్కార్ తీసుకురానున్న కొత్త ఆర్డినెన్స్ పై బీజేపీ మండిపడుతూనే ఉంది. దాణా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రక్షించేందుకే ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తోందని విమర్శించింది. ఎందుకంటే యూపీఏ సంకీర్ణానికి లాలూ పార్టీ మద్దతిస్తోందని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అన్నారు. దాణా కేసులో లాలూకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని, అప్పుడు ఆయన తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుందని.. అందుకే ఈనెల 30లోగా ఆర్డినెన్స్ ఆమోదింపచేయాలని చూస్తున్నారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. దీనికితోడు సొంత పార్టీ ఎంపీలు, ఇటీవల దోషిగా నిరూపితమైన రషీద్ మసూద్, ఇంకా ఇతర నేతలపై కోర్టులు వెల్లడించనున్న తీర్పుల నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ తెచ్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు.