: సచిన్ డిఫెన్స్ ఇక దుర్భేద్యం కాదా..?
ఒకప్పుడు సచిన్ బరిలో ఉన్నాడంటేనే ప్రత్యర్థి జట్లు సగం ఆశలు వదులుకునేవి. నేడు సచిన్ బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తే అనామకులు సైతం బౌలింగ్ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. దానర్థం, సచిన్ వికెట్ క్రమేణా విలువ కోల్పోతోందనే. అంటే, ఆ బ్యాటింగ్ దిగ్గజం డిఫెన్స్ టెక్నిక్ బీటలు వారుతోందన్నమాట. ఇటీవలే వన్డేలు, అంతర్జాతీయ టి20 క్రికెట్ నుంచి రిటైర్మెంటు ప్రకటించిన సచిన్.. టెస్టుల్లోనూ, దేశవాళీ క్రికెట్ టోర్నీల్లోనూ కొనసాగుతున్నాడు. ఇక టెస్టు క్రికెట్ నుంచి తప్పుకునే రోజూ మరెంతో దూరంలో లేదు. నవంబర్లో విండీస్ తో సొంతగడ్డపై 200వ టెస్టు ఆడిన తర్వాత సచిన్ క్రికెట్ కు పూర్తిస్థాయిలో గుడ్ బై చెబుతాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం చాంపియన్స్ లీగ్ 20 టోర్నీలో ఆడుతున్న సచిన్.. ముంబయి ఇండియన్స్ జట్టు కోసం పెద్దగా స్కోర్లు సాధించిందేమీలేదు. నిన్న హైవెల్డ్ లయన్స్ తో మ్యాచ్ లోనూ ఈ ముంబైకర్ పేలవరీతిలో వెనుదిరిగాడు. కేవలం ఐదు పరుగులు చేసి సొహయిల్ తన్వీర్ విసిరిన బంతికి బౌల్డయ్యాడు. పేస్ లో వైవిధ్యం ప్రదర్శిస్తూ తన్వీర్ స్లో డెలివరీ విసరగా.. లైన్ ను అర్థం చేసుకోవడంలో పొరబడిన సచిన్.. వికెట్ ను అప్పగించేశాడు. అంతకుముందు జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ సచిన్ 15 పరుగులే చేయడం అతడి ఫామ్ లేమికి అద్దం పడుతోంది.
కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో సచిన్ విఫలమైనా, ముంబయి ఇండియన్స్ 7 వికెట్లతో లయన్స్ పై నెగ్గింది. తొలుత లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో స్మిత్ (63 నాటౌట్), పొలార్డ్ (31 నాటౌట్), రోహిత్ శర్మ (20) రాణించడంతో ముంబయి మరో తొమ్మిది బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకి చేరింది. ఈ విజయంతో ముంబయి నాకౌట్ రౌండు ఆశలను సజీవంగా నిలుపుకుంది.