: అందరినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నాం: దిగ్విజయ్
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ సీఎం కిరణ్ మాట్లాడిన తీరుపై కేంద్ర స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. కిరణ్ ఏం మాట్లాడారో రికార్డులు చూసి తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని కాంగ్రెస్ సెక్రెటరీ జనరల్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, సెక్రెటరీ జనరల్... వీటిలో ఏ పదవీ శాశ్వతం కాదని సీఎం వ్యాఖ్యానించడం తెలిసిందే. అంతే కాకుండా, తననెప్పుడూ దిగ్విజయ్... సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి అని సంబోధిస్తారని కిరణ్ అన్న సంగతి కూడా విదితమే.
ఈ నేపథ్యంలో దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటు విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీల మాదిరి... ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ వెనకడుగు వేయబోదని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీల మాదిరి తాము యూటర్న్ తీసుకోలేమని తెలిపారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని... ఇప్పటివరకైతే అందరినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ అన్నారు. కిరణ్ ను అన్ని ప్రాంతాలకు సీఎం అని మాత్రమే అన్నానని చెప్పారు.