: పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ల మేజిక్ 'అత్తారింటికి దారేది?'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన పవరేంటో చూపించాడు. ఈ రోజు (సెప్టెంబర్ 27) పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా విడుదలైంది. ఎన్నో సమస్యలు, ఆటంకాలు ఎదురైనా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అసలు ఈ సినిమాకొచ్చినన్ని కష్టాలు ఏ సినిమాకీ వచ్చుండవు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా రెండు ప్రాంతాల్లోనూ సినిమాను ఆడనివ్వమని వార్నింగ్ లు. దీనికి తోడు సినిమా రిలీజ్ కాకముందే మార్కెట్లో సందడి చేసిన సినిమా సీడీలు. మరో సినిమా అయితే కన్నీళ్లే మిగిల్చేది. కానీ, ఇది పవర్ స్టార్ సినిమా. అందుకే ఆరడుగుల బుల్లెట్ లా దూసుకుపోయింది. పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్, మాస్ ఫాలోయింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అసలు సినిమాలో ఏముందో ఓ సారి చూద్దాం.
ఇటలీలో ఉన్న రఘు నందా (బొమన్ ఇరానీ) లక్ష కోట్లకు అధిపతి. అతని మనవడే గౌతమ్ నందా (పవన్ కల్యాణ్). రఘు నందాకు ఇంత ఆస్తి ఉన్నా ఒక లోటు మాత్రం వేధిస్తుండేది. అదేంటంటే, కూతురు సునంద (నదియా) తనతో లేకపోవడం. దీంతో మనవడి పుట్టిన రోజున 'మీ అత్తను తీసుకొస్తావా?' అని ఒక కోరిక కోరతాడు. తాతయ్య కోరికను తీర్చడానికి గౌతమ్ ఇండియాకొస్తాడు. అత్త సునంద ఒక ఫైవ్ స్టార్ హోటల్ యజమాని. ఆమెకు ఇద్దరు కూతుర్లు... శశి (సమంత), ప్రమీల (ప్రణీత). ఆ ఇంట్లో సాధారణ డ్రైవర్ గా చేరిన గౌతమ్.. తన అత్త మనసును మార్చగలిగాడా? తాత దగ్గరకు చేర్చగలిగాడా? అనేదే ఈ సినిమా కథ.
నిజం చెప్పాలంటే ఇదేం కొత్త కథ కాదు. అయినా త్రివిక్రమ్ దీన్ని అద్భుతంగా మలిచాడు. ఎప్పుడూ మాస్ మసాలా క్యారెక్టర్లు చేసే పవన్ తో ఈ సారి పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ ని నిర్మించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పవన్ కల్యాణ్ చేయాల్సిన సినిమా కాదు. కానీ, త్రివిక్రమ్ మీద తనకున్న నమ్మకంతో పవన్ ఈ సినిమాను అంగీకరించాడు. సో... సినిమా క్రెడిట్ పవన్ కల్యాణ్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా దక్కుతుంది.
ఇకపోతే ఈ చిత్రంలో గౌతమ్ నందా క్యారెక్టర్ పవన్ కల్యాణ్ కు అతికినట్టు సరిపోయిందనే చెప్పాలి. పవర్ స్టార్ అభిమానులను, సినీ ప్రేక్షకులను అలరించే విధంగా గౌతమ్ క్యారెక్టర్ ను త్రివిక్రమ్ మలిచాడు. ఈ క్యారెక్టర్ లో ఉండే ఎమోషన్స్, డైలాగ్స్, ఎంటర్ టైన్ మెంట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. "చూడు సిద్దప్పా.. నేను సింహం లాంటి వాణ్ని ... సింహం నిద్రపోతుంటే జూలుతో జడవేయొద్దు, పులి పలకరించిందని పక్కనే నించుని ఫోటోకు ఫోజివ్వద్దు" లాంటి పంచ్ డైలాగ్స్ ఈ చిత్రంలో మరెన్నో. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కి పవన్ కల్యాణ్ మరింత పవర్ తెచ్చాడు. సినిమా ద్వితీయార్థంలో బ్రహ్మానందం చేసిన అహల్య ఎపిసోడ్ మంచి కామెడీ పండించింది. రైల్వే స్టేషన్ లో తీసిన క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. ఈ సన్నివేశంలో పవన్ కల్యాణ్ నటన, త్రివిక్రమ్ టేకింగ్ క్లైమాక్స్ ను ఓ రేంజ్ కి తీసుకెళతాయి.
రఘునందాగా బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ నటించాడు. టాలీవుడ్ లో ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన నదియా ఈ సినిమాలో సునందా పాత్రలో నటించింది. నదియా పాత్ర ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, హీరోయిన్ల కంటే నదియాకే ఈ సినిమాలో ఎక్కువ స్కోప్ ఉంది. నదియా భర్తగా నటించిన రావు రమేష్ ఆకట్టుకున్నాడు.
ఇక ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన మరో వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాకు డీఎస్పీ అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్ లో అత్తారింటికి దారేది ఆడియో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 'ఆరడుగుల బుల్లెట్టు', పవన్ కల్యాణ్ పాడిన 'కాటమ రాయుడా' పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. కిర్రాక్, దేవ దేవం, బాపు గారి బొమ్మ, టైం టు పార్టీ, నిన్ను చూడగానే పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఆడియో రిలీజ్ అయిన తర్వాత పాటలకు ఎలాంటి స్పందన వచ్చిందో థియేటర్లలో కూడా అదే వాతావరణం కనిపించింది.
ఏరకంగా చూసినా... అత్తారింటికి దారేది సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రాలలో మరో మైలు రాయిగా నిలిచిపోనుంది. ఖుషి సినిమా తర్వాత పవన్ నుంచి వచ్చిన ఆ రేంజ్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఇది. అన్ని సెంటర్లలో హిట్ టాక్ వచ్చిన అత్తారింటికి దారేది సినిమా... రాష్ట్రంలో పరిస్థితులు సహకరిస్తే సంచలన విజయం సాధించే అవకాశం ఉంది!