: యాభై ఏళ్ల క్రితంనాటి కోట్ల విలువైన నిధి దొరికింది
ఒక తృప్తి కోసం వెళితే మరో తృప్తి లభించింది. ఫ్రాన్స్ లోని అల్బర్ట్ విల్లేకి చెందిన ఒక పర్వతారోహకుడికి ఈ అనుభవం ఎదురైంది. ఎప్పట్లానే పర్వతారోహణ చేస్తున్న ఇతనికి యాభై ఏళ్ల క్రితం 'మాంట్ బ్లాంక్' మంచుకొండల్లో కూలిపోయిన విమానం కనిపించింది. అందులోకి ప్రవేశించిన అతనికి ఒక పెట్టె నిండా పచ్చలు, నీలాలు, పగడాలు దొరికాయి. వీటి విలువ 3,32,000 డాలర్లు. మన కరెన్సీలో ఇది రెండు కోట్ల రూపాయలకు పైమాటే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కూలిన విమానం 'ఎయిర్ ఇండియా'కి సంబంధించింది. కళ్లు చెదిరే నిధి దొరికితే ఎవరైనా అయితే ఎగిరి గంతేసేవారు. కానీ ఈ యువకుడు మాత్రం 'రాముడు మంచి బాలుడు' స్టైల్లో వాటిని పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు.
నిధిని పోలీసులకు అప్పగించిన యువకుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. కానీ, ఎయిర్ క్రాష్ లో చనిపోయిన వారి నిధిని జాగ్రత్తగా పోలీసులకు అప్పజెప్పిన అతని నీతిని స్థానిక పోలీసు అధికారి మెర్లీ మెచ్చుకున్నారు. ఈ విలువైన రత్నాలు కలిగిన ప్యాకెట్ల మీద 'మేడ్ ఇన్ ఇండియా' అనే స్టాంప్ ఉన్నట్టు పోలీసు అధికారి తెలిపారు. అయితే, ఫ్రెంచ్ చట్టం ప్రకారం, దొరికిన నిధికి సంబంధించిన యజమానిని గుర్తించలేనట్టయితే... ఆ నిధి ఎవరికైతే దొరుకుతుందో వారికే ఇచ్చేస్తారు. మాంట్ బ్లాంక్ పర్వతాల్లో 1950, 1966 సంవత్సరాల్లో రెండు 'ఎయిర్ ఇండియా' విమానాలు కూలిపోయాయి.