: విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే వ్యతిరేకిస్తా: మంత్రి విశ్వరూప్
విభజన ఆగుతుందంటూ వస్తున్న వార్తలతో ఇన్నాళ్లు మిన్నకుండిన మంత్రి విశ్వరూప్..ఏకంగా విభజన తీర్మానాన్ని అసెంబ్లీకి పంపిస్తామని డిగ్గీరాజా చెప్పడంతో రాజీనామా ఆస్త్రాన్ని సంధించారు. గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. విభజన తీర్మానం రాష్ట్ర అసెంబ్లీకి వస్తే వ్యతిరేకంగా ఓటు వేస్తానన్నారు. అందుకోసమే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని చెప్పారు. ఒకవేళ విభజన ప్రక్రియ ఆపకపోతే పార్టీ నుంచి వెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం తనను కదిలించిందని, రేపటినుంచి ఎమ్మెల్యేగా ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తారన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.