: చివరి బంతి వరకు మ్యాచ్ ముగియదు : సీఎం


చివరి బంతి పడేవరకు మ్యాచ్ ముగియదని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం చాలా ముఖ్యమని అన్నారు. రాజకీయాలకన్నా... రాష్ట్ర శ్రేయస్సే తనకు ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను కేంద్రం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలు ప్రజాభీష్టానికి అనుకూలంగా పనిచేయాలని... ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని తెలిపారు.

ఆందోళన చేస్తున్న వారి సమస్యలను పరిష్కరించకుండా ముందుకు వెళ్లలేమని కిరణ్ కుండ బద్దలుకొట్టారు. హైదరాబాద్ అంశంపై పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడాని వీలవుతుందని అభిప్రాయపడ్డారు. నదీ జలాల పంపకం అంత ఈజీగా జరగదని... ఇప్పటివరకు ఏ రెండు రాష్ట్రాలకు నదీ జలాలను సమానంగా పంచలేకపోయారని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం ఒకే ప్రాంతంగా ఉంటేనే కృష్ణా, గోదావరి జలాలను వాడుకోవడానికి వీలవుతుందని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందని గుర్తుచేశారు. సాగునీటిపై రాష్ట్రాల మధ్య వేసిన అన్ని కమిటీలు దారుణంగా విఫలమయ్యాయని సీఎం తెలిపారు.

నేను హైదరాబాద్ లోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, అంతమాత్రాన హైదరాబాద్ మాదే అని నేను చెప్పడంలేదని... ఇది ఆంధ్రప్రదేశ్ ది అని కిరణ్ తెలిపారు. విద్య, వైద్యం లాంటి కీలకమైన అంశాలను విభజనకు ముందే పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విభజన జరిగితే ఇరు ప్రాంతాలలోనూ లక్షలాది మంది స్థానచలనం చెందాల్సి ఉంటుందని అన్నారు. రోజూ లక్షలాది మంది ప్రజలు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని... ఉద్యోగులు జీతం కూడా తీసుకోకుండా సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. వీరందరి మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

  • Loading...

More Telugu News