: మనం వదిలేసినా... అది మనల్ని వదలదట
కొందరు మత్తుమందుకు బానిసలవుతుంటారు. ఇందులో కూడా కొకైన్ తీసుకోవడానికి కొందరు బాగా అలవాటుపడివుంటారు. ఇలాంటి వారు ప్రయత్నపూర్వకంగా కొకైన్ వాడకాన్ని నిలిపివేసినా కూడా దాని ప్రభావం మెదడును వదలదట. ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చి చెబుతున్నారు.
కొకైన్‌ను వాడేవారు ఆ అలవాటును మానుకున్నా కూడా వారి మెదడు కోలుకోలేకపోతుందట. ఎందుకంటే కొకైన్‌కు అలవాటు పడిన మెదడు కోలుకోవడం అనేది ఒక జీవిత కాల ప్రక్రియ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొకైన్, ఇతర ఉత్ప్రేరకాలను వినియోగించే వారి మెదడులో జరిగిన మార్పులకు ఈ వ్యసనమే కారణమా? లేక ఇంతకుముందే మెదడులో మార్పులు జరిగాయా? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని సాగించారు. హార్ట్‌ఫర్డ్ ఆసుపత్రి, కళాశాలల సంస్థకు చెందిన భారతీయ శాస్త్రవేత్త కృష్ణపటేల్ మూడు రకాల వ్యక్తులను బృందాలుగా ఏర్పరచి వారి మెదడులోని నాడీ ప్రతిస్పందనలను తెలుసుకునేందుకు వారిపై పరిశోధనలు జరిపారు. ఆరోగ్య నియమాలను పాటించే 47 మంది, ప్రస్తుతం కొకైన్ వ్యసనమున్న 42 మంది, నాలుగేళ్ల కిందట కొకైన్ మానేసిన 35 మందిపై ఈ ప్రయోగం జరిపారు. ఈ అధ్యయనంలో కొకైన్ వ్యసనం వీడినవారి మెదడు కోలుకోవడం అనేది ఒక జీవితకాల ప్రక్రియ అని ఈ అధ్యయనానికి సంబంధించిన వ్యాసాలను ప్రచురించిన బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్ సంపాదకుడు జాన్ క్రిస్టల్ చెబుతున్నారు.