: మామయ్య వయసు ఎంతంటే...


అందరికీ మామగా చెప్పే చందమామ వయసు ఎంత ఉంటుంది...? ఏమో తెలియదు అనుకుంటాం. అయితే చందమామ వయసును లెక్కంచడానికి శాస్త్రవేత్తలు పలు ప్రయత్నాలు చేశారు. ఎలాగోలా చంద్రుని వయసును లెక్కించి చెప్పారు. అయితే ఇప్పటి వరకూ చెప్పిన వయసు లెక్కలన్నీ తప్పేనట. ఎందుకంటే శాస్త్రవేత్తలు చందమామ వయసును ప్రత్యేక విధానం ద్వారా లెక్కగట్టి తేల్చారు. చందమామ వయసు గతంలో చెప్పిన వయసుకంటే పదికోట్ల ఏళ్లు తక్కువని తేల్చారు.

చందమామ 440 నుండి 445 కోట్ల సంవత్సరాల మధ్య పుట్టి వుంటాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్న ఒక సిద్ధాంతం ప్రకారం 456 కోట్ల ఏళ్ల క్రిందట గుర్తుతెలియని గ్రహం ఒకటి భూమిని ఢీకొట్టడం వల్ల వచ్చిపడ్డ శకలాలు చంద్రుడిగా ఏర్పడ్డాయి. అయితే తాజాగా చంద్రుడిపైని శిలలను విశ్లేషించినప్పుడు చంద్రుడి వయసు 440 కోట్ల నుండి 445 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుందని తేలింది. ఢీకొట్టిన తర్వాత చందమామపై భారీ స్థాయిలో ఘనీభవించిన శిలాసాగరం ఉందని, ఈ సాగరం నుండి వెలువడిన శిలలను విశ్లేషించినపుడు వాటి వయసు 436 కోట్ల సంవత్సరాలని తేలింది. భూమిపై పలుచోట్ల శిలలు 445 కోట్ల ఏళ్ల కిందట ఘనీభవించినట్టు తేలింది. దీనిప్రకారం చూస్తే చంద్రుడి వయసు ముందుచెప్పిన వయసుకన్నా పదకొండు కోట్ల సంవత్సరాలు తగ్గుతుంది. కార్నెగీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన రిచర్డ్‌ కార్ల్‌సన్‌ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ ఈ ఢీకొట్టడం అనే ఘటనకు ముందు భూమి ఎక్కడికక్కడ వర్గీకరణ చెందివుంటే, ఢీకొట్టడం వల్ల తొలినాళ్లలో ఏర్పడ్డ ప్రాథమిక వాతావరణం చెదిరిపోయి ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News