: తెలుగు చిత్రసీమకు అవమానం: నిర్మాత కాట్రగడ్డ మురారి
చెన్నై వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన 'వందేళ్ల భారతీయ సినిమా వేడుక' ఉత్సవాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర అవమానం జరిగిందని నిర్మాత కాట్రగడ్డ మురారి మండిపడ్డారు. పరిశ్రమకు చెందిన సీనియర్లను ఎవరినీ ఉత్సవాలకు పిలవలేదని, వెళ్లినవారికి తగిన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పిలుస్తారని చెప్పినా, కనీసం ఎవరూ ఫోన్ కూడా చేయలేదని.. అందుకే వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చెన్నైలో నివాసముంటున్న తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్లలో చాలామందిని ఆహ్వానించలేదన్న కాట్రగడ్డ.. వెన్నెలకంటి, భువనచంద్రలాంటి వారిని కూడా పిలవకపోవడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు.
సీనియర్ నటి కవిత, నారాయణమూర్తి, పలువురు ఉత్సవాల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 150కి పైగా చిత్రాల్లో నటించి, అగ్రహీరోల సరసన చేసిన తనకు కనీసం పిలుపు కూడా లేదని కవిత కన్నీరు పెట్టుకున్నారు. వందేళ్ల సినిమా సంబరాలంటే కళామతల్లికి ధన్యవాదాలు చెబుతారనుకుంటే వేదికపై డాన్సులు, డ్రామాలు వేయించి సినీరంగ గౌరవాన్ని మంటగలిపారని దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. అందుకే తనకు అక్కడ నిలబడాలనిపించక మధ్యలోనే తిరిగి వచ్చేసినట్లు తెలిపారు.