: జగన్ దారిలో నడుస్తాం: రోజా
ప్రజలు కోరుకున్న రోజు వచ్చిందని, జగన్ జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వచ్చాడని వైఎస్సార్సీపీ మహిళా నేత, సినీ నటి రోజా అన్నారు. లోటస్ పాండ్ లో జగన్ కు ఆహ్వానం పలికేందుకు ఎదురు చూస్తున్న ఆమె మీడియాతో మాట్లాడారు. కుట్రలు చేసినా, కుయుక్తులు పన్నినా సత్యం ముందు నిలవలేకపోయాయని అన్నారు. గతంలో బహిరంగ సభలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజల్లోకి వెళ్లేటప్పుడు అక్కడి స్థానికులు తమను జగన్ ఎప్పుడొస్తాడని అడిగే వారని, దానికి సమాధానం చెప్పలేక పోయేవారమని, అయితే, జగన్ విడుదలవడంతో తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని రోజా తెలిపింది. ఇక పార్టీని పటిష్టం చేయడానికి జగన్ కృషి చేస్తాడని ఆమె స్పష్టం చేశారు. తామంతా జగన్ బాటలోనే నడుస్తామని ఆమె తెలిపింది.