: అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ముడి చమురు ధర
ఆగస్టులో 117 డాలర్లున్న బ్యారెల్ ముడి చమురు ధర 108 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో చమురు ధర తగ్గుముఖం పట్టింది. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన ఇరాన్... తన అణు కార్యక్రమాలపై అంతర్జాతీయ సమాఖ్యతో చర్చించడానికి సిద్ధమని ప్రకటించడంతో పరిస్థితుల్లో అనూహ్య మార్పులొచ్చాయి. ఈ సమాఖ్యలో అమెరికాతో పాటు మరో ఐదు దేశాలున్నాయి. ఇరాన్ చర్యతో... అమెరికా, ఇరాన్ మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందనే భావన ఏర్పడింది. ఇరాన్ పై ఆంక్షలు తొలగిపోతే... అక్కడ నుంచి ప్రతిరోజు అదనంగా లక్ష బ్యారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది.
దీంతో పాటు ఇటీవల కాలంలో సిరియాపై యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో మధ్య ప్రాచ్యంలో ఆయిల్ ఉత్పత్తి అమాంతం తగ్గింది. ప్రస్తుతం సిరియాపై అమెరికా యుద్ధం చేయాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పడంతో మిడిల్ ఈస్ట్ దేశాలలో చమురు ఉత్పత్తి పెరగనుంది. దీనికి తోడు లిబియాలో అల్లర్ల సమయంలో ఆగిపోయిన ఆయిల్ పోర్ట్ లను తిరిగి ప్రారంభిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో రానున్న కాలంలో చమురు ఉత్పత్తి భారీగా పెరగనుండటంతో... చమురు ధరలు మరింత తగ్గుతాయని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.