: విడుదలైన జగన్
అక్రమాస్తుల కేసులో సుదీర్ఘ రిమాండ్ అనంతరం వైఎస్సార్సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు నిన్న నాంపల్లిలోని సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా.. తదనంతర లాంఛనాలు ఈ మధ్యాహ్నానికి పూర్తయ్యాయి. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం సీబీఐ కోర్టు విడుదల ఉత్తర్వులను చంచల్ గూడ జైలు అధికారులకు పంపింది. వాటిని పరిశీలించిన పిదప జైలు అధికారులు జగన్ ను విడుదల చేశారు.
ఆయన కోసం జైలు వద్ద ఉదయం నుంచే నిరీక్షిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో, జైలు పరిసరాల్లో కోలాహలం నెలకొంది. మరోవైపు లోటస్ పాండ్ లోని ఆయన నివాసం వద్ద భారీ స్వాగతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.