: స్పాట్ ఫిక్సింగ్ లో నలుగురు సన్ రైజర్స్ ఆటగాళ్లు..?
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ సెగ హైదరాబాద్ సన్ రైజర్స్ కూ తాకింది! 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' తెలిపిన వివరాల ప్రకారం... ముంబైకి చెందిన బుకీ చంద్రేష్ పటేల్ పోలీసు ఇంటరాగేషన్ లో పలు వివరాలు బయటపెట్టాడు. ఇందులో ఏప్రిల్ 17న పుణే వారియర్స్, సన్ రైజర్స్ మ్యాచ్ కు ముందు తిస్సర పెరీరా, బిహారీ, ఆశిష్ రెడ్డి, కర్ణ్ శర్మ లను కలిశానని పటేల్ వెల్లడించాడు. అయితే హైదరాబాద్ టీంలో బిహారీ అనే ఆటగాడు లేకపోవడం గమనార్హం. విహారి అనే పేరును బిహారీ అని అనుండొచ్చని అనుమానం.
ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఆశిష్ రెడ్డి సోదరుడు ప్రీతం రెడ్డి కీలక పాత్ర పోషించాడని పటేల్ తెలిపినట్టు 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' వివరించింది. పుణేలోని మెరిడియన్ హోటల్ లో హైదరాబాద్ ఆటగాళ్లు, ప్రీతం రెడ్డి, బుకీలు సమావేశమయ్యారని పత్రిక పేర్కొంది. మ్యాచ్ ఎలా ఫిక్స్ చేయాలో చర్చించిన తర్వాత... అంతా సవ్యంగా జరిగేట్టు చూడటం తన బాధ్యత అని ప్రీతం రెడ్డి చెప్పినట్టు వెల్లడించింది.
అయితే పటేల్ చెప్పిన విషయాలను విశ్లేషించిన ఒక క్రైం బ్రాంచ్ సీనియర్ అధికారి మాత్రం దీన్ని ఫిక్సింగ్ గా చూడలేమని అన్నారు. ఈ వ్యవహారంలో బుకీలు ఆటగాళ్లను కలవడం మాత్రమే జరిగిందని తెలిపారు. అయితే, పటేల్ వాగ్మూలం ప్రకారం ఛార్జ్ షీట్ లో వీరి పేర్లు నమోదు చేశామని అన్నారు. అయితే వీరిని ముద్దాయిలుగా పేర్కొనలేదని తెలిపారు.
పెరీరాపై వచ్చిన వార్తలను శ్రీలంక క్రికెట్ బోర్డు ఖండించింది. దీనికి సంబంధించి బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని కొట్టిపడేసింది.