: చెన్నైలో ఘనంగా అక్కినేని జన్మదిన వేడుకలు
టాలీవుడ్ పెద్ద దిక్కు, నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు 90వ జన్మదిన వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఇక్కడి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అనేకమంది దక్షిణాది నటుల మధ్య అక్కినేని పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు. దక్షిణ భారత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. నిన్న రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని కేక్ కట్ చేయగా.. పలువురు దక్షిణ భారత నట ప్రముఖులు ఆయనకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ డ్రమ్మర్ శివమణి తన వాద్య ప్రతిభతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖలను విశేషంగా అలరించారు.
ఈ వేడుకలో అక్కినేని నాగార్జున, అమల, సుమంత్, వెంకటేశ్, కమల్ హాసన్, దక్షిణ భారత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సి.కల్యాణ్, నిర్మాత రామానాయుడు, దర్శకుడు రాఘవేంద్రరావు, మురళీమోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి మారుతీరావు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, రానా, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.