: సీబీఐ కేసును నీరుగార్చింది... జగన్ కు క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు?: బాబు


జాతీయ సమగ్రత మండలి సమావేశంలో తనకు మైక్ కూడా ఇవ్వలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే దిగ్విజయ్ సింగ్ టీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ కు బెయిలు లభించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్సీపీకి మధ్య జరిగిన ఒప్పందం నిజమని నిరూపితమైందన్నారు.

ఛార్జీషీట్లు వేయకముందే జగన్ అండ్ కో బెయిల్ పిటిషన్లు వేసేదని, అది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అలాగే జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ మొత్తం 10 ఛార్జీషీట్లు వేసిందని, ఒక్కదానికి కూడా సాక్ష్యాధారాలు లేవని తెలిపిందని, అది ఎలా వీలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీబీఐ సుప్రీం కోర్టుకు సమాధానమిస్తూ విదేశాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి మూలాలు ఉన్నాయని తెలిపిందని అన్నారు. అంటే సుప్రీం కోర్టును కూడా సీబీఐ తప్పుదోవ పట్టించిందా? అని అడిగారు.

సీబీఐ దర్యాప్తు అధికారులను ఇద్దరిని ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్ పర్ చేసిందని ఆయన ఆరోపించారు. సీబీఐ ఇప్పడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లా ఉందని విమర్శించారు. సీబీఐ కనీసం సమర్థులైన అడ్వకేట్లను కూడా పెట్టుకోలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయాలు స్పష్టంగా జగన్ కేసులో సీబీఐ తీరుతో తేటతెల్లమయ్యాయని ఆయన విమర్శించారు. రాజకీయాలు దిగజారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ స్క్రిప్ట్ రాస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని ఆయన ఆక్షేపించారు. కాంగ్రెస్ తీరును ఎండగడుతూ అన్నా హజారే ఉద్యమం చేస్తే దాన్ని తప్పుడు ప్రమాణాలతో నీరుగార్చేశారని ఆయన మండిపడ్డారు.

అవినీతికి పాల్పడ్డారని సత్యం రామలింగరాజు ఆస్తులను అటాచ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయనను నాలుగేళ్లు జైలులో ఉంచారని తెలిపిన బాబు, ఈ కేసు అంతకంటే తక్కువా? అని ప్రశ్నించారు. జగన్ కేసులో కుమ్మక్కయ్యాయని చాలా కంపెనీలను పేర్కొన్న సీబీఐ వాటి సంగతి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికార కాంక్ష.. ఈ రెండూ జాతీయ సంక్షోభానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు.

ఏం జరిగినా సరే మా ఇష్ట ప్రకారం జరుగుతుందనడం అరాచకమని కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడలతో ముందుకు వెళుతోందని ఆయన విమర్శించారు. అయినా సరే టీడీపీ తన కర్తవ్యం మర్చిపోదని, ఆ రెండు పార్టీలపై పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ కేసుల విషయాన్ని న్యాయస్థానాల్లో తేలుస్తామని చెప్పారు. జగన్ అవినీతిని కోర్టు దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళతామని తెలిపారు. జగన్ కేసు తీరు తెన్నులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News