: మెదడు క్యాన్సర్‌ను కంట్రోల్ చేయొచ్చు!
మెదడుకు వచ్చే క్యాన్సర్ వ్యాధి వ్యాప్తిని కంట్రోల్ చేయవచ్చా... అంటే చేయవచ్చనే అంటున్నారు శాస్త్రవేత్తలు. దీని వ్యాప్తిని నిలువరించగలిగే ఒక ప్రత్యేకమైన స్విచ్‌ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన శరీరంలోనే ఉండే ఒక రకమైన ప్రోటీను మెదడులోని కణితి కణాల మనుగడ విషయంలో కణాల రక్షణకుగానీ, లేదా వాటి నాశనానికి గానీ కీలకంగా పనిచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రోటీన్‌ను అదుపు చేయగలిగితే క్యాన్సర్ వ్యాధిని నిలువరించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
క్యాన్సర్ వ్యాధుల్లో మెదడుకు సోకే క్యాన్సర్ ఎక్కువగా కనిపించేది, అలాగే వేగంగా పెరిగే క్యాన్సర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి క్యాన్సర్‌ను ఒక ప్రోటీన్ నిలువరించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆర్‌ఐపీ1 అనే ప్రోటీను మెదడు కణితి కణాల పెరుగుదల విషయంలోను, కణాల రక్షణ విషయంలోను, లేదా వాటిని నాశనం చేయడంలోను కీలకంగా పనిచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. టెక్సాస్ సౌత్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయ వైద్యకేంద్రానికి చెందిన పరిశోధకులు ఈ ఆర్‌ఐపీ1 అనే ప్రోటీనును గుర్తించారు. ఈ ప్రోటీనును లక్ష్యంగా చేసుకుని క్యాన్సర్ నిర్మూలించే విధంగా ఔషధాలు రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్లియోబ్లాస్టోమాలో కణ విభజనను, కణాల మరణాన్ని నియంత్రిస్తున్న ఆర్‌ఐపీ1కు సంబంధించిన కొత్త యంత్రాంగాన్ని తమ అధ్యయనంలో గుర్తించామని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ అమిన్ హబీబ్ చెబుతున్నారు. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన డాక్టర్ వినేష్‌కుమార్, డాక్టర్ శర్మిష్ఠ చక్రవర్తి, శాండిలి చౌన్సే, డాక్టర్ సందీప్‌బర్మాలతోబాటు డాక్టర్ లిలి కూడా పాలుపంచుకున్నారు.