: నోరు ఆడిస్తూవుంటే ఎవరికైనా ముప్పే
కొందరికి ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఇలాంటి అలవాటు ఎక్కువగా మహిళలకు ఉంటుంది. ఈ అలవాటు కారణంగా ఎక్కువమంది మహిళలు ఊబకాయం బారిన పడుతుంటారు. అయితే కేవలం మహిళలకే కాకుండా ఇలా అదేపనిగా తింటూ ఉంటే పురుషులకు కూడా ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండే పురుషుల్లో కూడా స్థూలకాయం ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
మహిళలతో పోలిస్తే ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి తినే అలవాటున్న పురుషుల్లో కొలెస్టరాల్, అధిక రక్తపోటు పెరగడం వంటి సమస్యలు ఎక్కువవుతాయని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇలాంటి అలవాటు బారిన పడినవారు తాము తీసుకునే ఆహారంపై నియంత్రణ కోల్పోతారని, నిజానికి ఇలాంటి సమస్య మహిళలతో పోలిస్తే పురుషుల్లో చాలా తక్కువేనని ఇంతకాలం భావిస్తూ వచ్చామని, అయితే పురుషుల్లో కూడా ఈ అలవాటు వల్ల ముప్పు తప్పదని ఈ పరిశోధనలో పాల్గొన్న టోమోకో ఉడో చెబుతున్నారు.
ఈ అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా పలువురు ఊబకాయులైన స్త్రీ, పురుషులను పరిశీలించారు. ఈ పరిశీలనలో పురుషులే ఎక్కువగా పలు సమస్యల బారిన పడినట్టుగా వీరు గుర్తించారు. ఇలా అతిగా తినడం కారణంగా మహిళలు త్వరగా బరువెక్కడం, దానిని తగ్గించుకునేందుకు తర్వాత ఏదైనా ఆహార నియంత్రణ పాటించడం వంటివి మొదలుపెడతారని, అయితే స్థూలకాయులైన పురుషులు తమ బరువును తగ్గించుకునేందుకు కఠినమైన శారీరక వ్యాయామాలపైనే ఎక్కువగా ఆధారపడతారని ఈ పరిశోధకులు గుర్తించారు.