: నా జోస్యం నిజమైంది: లగడపాటి
గతంలో తాను చెప్పిన అంశాలు లెక్కలతో సహా నిజమని నిరూపించానని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, సమైక్య ఉద్యమం తెలుగుతల్లి గర్భసంచి నుంచి వచ్చిందని అన్నారు. తనపై లేని పోని అభాండాలు వేసి ఆడిపోసుకుంటున్నారని అన్నారు. సమైక్యం కోసం రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన వాణ్ణని ఆయన అన్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని కూడా తప్పుపట్టిన చరిత్ర తమదని లగడపాటి రాజగోపాల్ అన్నారు.
టీడీపీ విభజనకు అనుకూలంగా లేఖ ఇస్తున్నప్పుడే తాను హెచ్చరించానని ఆయన గుర్తు చేశారు. తెలుగు తల్లి మెడపై కత్తి వేలాడుతోందని, తప్పులు చేయడానికి తాము సిద్థంగాలేమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై నోట్ కేబినెట్ వద్దకు వచ్చిన మరుక్షణం ఎంపీలంతా స్పీకర్ వద్ద బైఠాయించి మరీ రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామని లగడపాటి తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే వచ్చే ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని తాను తెలిపానని, అయితే కేంద్రం తన మాటలను పట్టించుకోలేదని లగడపాటి చెప్పారు.
ఇప్పుడు ప్రజా ఉద్యమ తీవ్రతను చూస్తే విభజన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారో, సమైక్యం వైపు మొగ్గు చూపుతున్నారో తెలుస్తుందని ఆయన సూచించారు. రాష్ట్ర సమైక్యత కోసం నిరంతరం కృషి చేసే తనలాంటి వ్యక్తిపై నిందలు వేయడం సరికాదని సూచించారు.