: ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాదును వదిలి వెళ్ళండంటే ఎలా?


అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాదును వదిలి వెళ్ళండని చెబితే ఎలాగని సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సతీమణులు ప్రశ్నించారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతిని కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామని తెలిపారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర నష్టపోతుందని ఆయనకు విన్నవించామని వారు తెలిపారు. అంతే కాకుండా, హైదరాబాద్ ను యూటీ చేస్తే ఇరుప్రాంతాలకు నష్టమని రాష్ట్రపతికి తెలిపామని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని... రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా ఉన్నాయని తెలిపారు. విద్య, వైద్య, ఉద్యోగం ఏది కావాలన్నా రాజధానికే రావాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పుడు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైలు కూడా వస్తోందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ను వదిలి వెళ్లమనడం భావ్యం కాదని చెప్పారు.

  • Loading...

More Telugu News