: ఢిల్లీ పెద్దలు రెచ్చగొడుతున్నారు: జేసీ
స్వలాభం కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తోందని సీమాంధ్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, విభజన ఆగదంటూ ఢిల్లీ పెద్దలు చెప్పడం ప్రజలను మరింత రెచ్చగొట్టడమేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు ఐటీఐఆర్ హోదా కల్పించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పెద్దలు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని జేసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదంతా తమ దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని తాను చెబుతున్నప్పటికీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదని అన్నారు. సీమాంధ్రలో మరో నేత ఎదగకుండా చేసిన ఘనత వైఎస్ దేనని, ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమే ఉత్తమమనిపిస్తోందని నిరాశ వ్యక్తం చేశారు. సీమాంధ్రలో రాజకీయ శూన్యత ఉన్నందున కొత్త పార్టీకి అవకాశం ఉందని, అయితే ఎవరు ముందుకు వస్తారో చూడాలని జేసీ తెలిపారు.